వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీ నుంచి పోటీకి తన మనస్సు అంగీకరించట్లేదని తెలిపారు. కనీసం తనను సంజాయిషీ అడగకుండానే చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న బాలినేని వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారని.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లవచ్చని బాలినేని అన్నారని కోటంరెడ్డి చెప్పారు. బాలినేని మాటలు సీఎం మాటలుగా భావిస్తున్నానని అన్నారు.
“నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ ఉద్యోగాలకు ఇబ్బంది. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది. సజ్జల, విజయసాయి, ధనుంజయ్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే వారి స్పందన ఎలా ఉంటుంది. మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా? కొన్నిరోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డాను. కొన్నిరోజుల క్రితం మీడియా సమావేశంలోనే ఇంటెలిజెన్స్ అధికారులు కనిపించారు. ఇంటెలిజెన్స్ అధికారులను గమనించి కొందరు వార్తలు రాశారు. నాకు నటన, మోసం చేతకాదు.” – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
‘నా ఫోన్ ట్యాప్ చేయడం బాధాకరం. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని 4 నెలల ముందే ఐపీఎస్ అధికారి చెప్పారు. సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా. 20 రోజుల ముందు నా ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం లభించింది. సీఎంగానీ, సజ్జల గానీ చెప్పకుండా నా ఫోన్ ట్యాప్ అయి ఉండదు. నా ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి ఎంతో మనస్తాపం చెందా. నన్ను అనుమానించారని తెలిసి చాలా బాధపడ్డా. అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.