వాహ్‌.. చలాన్ వేసిన కానిస్టేబుళ్లనే అభినందించిన కేటీఆర్

ఇటీవలే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌ పడిన సంగతి తెలిసిందే. అయితే.. తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కే. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు.

సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళల ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు.

అయితే బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్ లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల చలాన్ విధించారని గుర్తు చేశారు కేటీఆర్‌. రూల్స్‌ ప్రకారం ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల నడుచుకున్న విధానం చాలా అద్భుతమని కొనియాడారు కేటీఆర్‌.