టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు పచ్చబడుతుంటే కొంత మంది కండ్లు ఎర్రబడుతున్నాయన్న కేటీఆర్.. చెరువులు నిండుతుంటే కొంతమంది గుండెలు మండుతున్నాయని ధ్వజమెత్తారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే సుష్మా స్వరాజ్ ప్రకటించిన మాదిరిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కృష్ణా జలాల్లో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని కొందరు పనికిమాలిన మాటలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
అధికారికంగా లెక్కలు చెప్తున్నా.. కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు మనకు కేటాయింపులు ఉండే. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతోంది.. అప్పట్నుంచి కేంద్రాన్ని అడుగుతున్నాం.. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల హక్కు ఇవ్వాలని, పంపకాలు తేల్చాలని అడిగాం. ప్రాజెక్టులు కట్టకుండా సతాయించిన జిల్లా పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాకు 575 టీఎంసీల నీటిని ఇవ్వండని 8 ఏండ్ల నుంచి కోరుతూనే ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.