భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశంం ఉంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఆయన స్వయంగా తాను కవిత బినామీనని వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్నివెనక్కి తీసుకుంటానని ఆయన హౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తో సంబంధం లేకుండా ఈడీ కస్టడీలో ప్రశ్నించి అదనపు వివరాలు రాబడుతోంది. స్వయంగా కవితకు బినామీనని ఒప్పుకున్నందున ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ .. కవిత ఈడీ విచారణ సందర్భంగా ఢిల్లీకి వెళ్తున్నారు. అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతూండటంతో న్యాయనిపుణులతో సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న కేటీఆర్ వెంట … భారత రాష్ట్ర సమితి న్యాయవిభాగానికి చెందిన పలువురు నిపుణులు కూడా ఢిల్లీ వెళ్లారు. కీలక నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలోనూ కేసీఆర్ కవితకు ఈడీ నోటీసులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.