త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఆషామాషీగా అయితే తీసుకోవడం లేదు. గ్రేటర్ లో ఈ పార్టీ జెండా ఎగిరితే, ఆ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ అవకాశం దక్కుతుందని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. అందుకే ఎవరికివారే పార్టీ జెండా ఎగురవేసి, ఆ స్థానాన్ని దక్కించుకోవాలనే విధంగా అన్ని పార్టీలు తమ శక్తికి మించి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ గ్రేటర్ లో కారును వాయువేగంతో దూసుకెళ్లేలా చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, నిధుల విడుదల ఇలా అనేక అంశాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ తీసుకు రావాలని చూస్తున్నారు. గతంలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేటీఆర్ సారధ్యంలో 99 డివిజన్లను గెలుచుకుని, మేయర్ స్థానాన్ని టిఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పుడు అదే రకమైన ఫలితాలను రాబట్టాలనే అభిప్రాయంతో మరింత గట్టిగా కేటీఆర్ కష్టపడుతున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం టిఆర్ఎస్ పార్టీపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. టీఆర్ఎస్ పై వ్యతిరేకత తీవ్రంగా ఉందని నిరూపించేందుకు ఇదే సరైన సమయం అనే అభిప్రాయంతో టీఆర్ఎస్ విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ కు మరింత మరింత ఉన్నత స్థానం దక్కే విధంగా ప్రణాళికలు వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ అవినీతి వ్యవహారాలను జనాలు ప్రస్తావించడంతో పాటు, టీఆర్ఎస్ కార్పొరేటర్లపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, గ్రేటర్లో కాంగ్రెస్ కు అవకాశం దక్కే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలనే అభిప్రాయం లో రేవంత్ ఉన్నారు. 2016 లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఫలితాలు రిపీట్ అవ్వకూడదు అనే అభిప్రాయంతో రేవంత్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక బిజెపి సైతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ సర్వేల్లో గ్రేటర్ లో బిజెపికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే సంకేతాలు రావడం, గతం కంటే పార్టీ ఇప్పుడు బాగా బలం పుంజుకోవడం, అధికారపార్టీపై ప్రజా వ్యతిరేకత ఉండడం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గ్రేటర్ వార్ లో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీ నెలకొంది. మరి గ్రేటర్ ఓటర్లు ఎవరు వైపు మొగ్గు చూపుతారో ?
-Surya