నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నాయని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చడం జరిగిందన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ అక్రమంగా వారి పార్టీలో చేర్చుకుందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. 75 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. 12 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారమే టిఆర్ఎస్ లో చేరారని తెలిపారు. మీరు ఇటుకలతో కొడితే మా కార్యకర్తలు బండలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇకనుంచి ఎవరు ఏమన్నా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు మంత్రి కేటీఆర్.