తిరుపతిలో లాక్‌డౌన్ అమల్లోకి రావడం, స్థానికంగా దర్శన టికెట్లు మంజూరు చేయకపోవడంతో తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న 4,834 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. వీరిలో 1,589 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ.43 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆన్‌లైన్ ద్వారా టికెట్లను ముందుగా బుక్ చేసుకున్న వారిలోనూ పలువురు దర్శనానికి రావడం లేదని తెలిపారు. కాగా, తాజాగా.. నగరంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన 236 మంది గల్లంతయ్యారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత వీరంతా తమ ఫోన్లను స్విచాఫ్ చేసేశారు. దీంతో ఒక్కసారిగా తిరుపతిలో ఆందోళన మొదలైంది.