చాలా రోగాలకు ఒత్తిడే ప్రధాన కారణం.. మనిషికి ఒత్తిడి ఉండకూడదు.. అని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. దీని వల్ల ఇబ్బందే కానీ ఒరిగేది ఏం లేదని అందరికీ తెలుసు. మనిషి జీవితంలో ఒత్తిడి లేకుండా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో తలమునకలు అవుతూనే ఉంటాడు. అయితే ఒత్తిడి అంత చెడ్డదేం కాదు..దీని వల్ల కూడా మంచి జరుగుతుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు. ఎలా అంటారా..?
యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు.. ఒత్తిడి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుందనే విషయాన్ని కనుగొన్నారు. తక్కువ నుంచి మధ్య స్థాయి ఒత్తిడి ప్రభావం కొందరు వ్యక్తులను మానసిక రుగ్మతల బారి నుంచి కాపాడుతుందని తేల్చారు. అలాగే వ్యక్తి గుణగణాలను పెంపొందించడంలో సహాయపడడుతుందని కూడా చెప్తున్నారు. నిరాశ, సంఘ విద్రోహ ఆలోచనలు, మానసిక రుగ్మతలను కలిగించే ఆలోచనలు రాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే మరింత ఒత్తడిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
మాదిరిస్థాయి ఒత్తిడి వాతావరణంలో ఉంటే ఆ వ్యక్తి మరింత ప్రభావంతంగా పనిచేయవచ్చని పరిశోధకులు, కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కన్స్యూమర్ సైన్సెస్లో అసోసియేట్ ప్రొఫెసర్ అసఫ్ ఓశ్రీ తెలిపారు. పరీక్షల కోసం చదువుతున్న వారు, పని ప్రదేశాల్లో పెద్ద పెద్ద సమావేశాల్లో పాల్గొనడం, ఎక్కువ సమయం పనిచేయడం వంటివి ఆ వ్యక్తి అభివృద్ధికి దారితీయవచ్చని.. లేదా తాను ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో కొనసాగాలో వద్దో నిర్ణయించుకోవడానికి దోహదపడుతుందని తాజా పరిశోధనలో తేలిన విషయం. అయితే ఒత్తిడికి.. అధిక ఒత్తిడికి మధ్య తేడా ఉంటుందని ఆయన అంటున్నారు.సానుకూలాంశాలతో కూడిన ఒత్తిడి భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా ఒక టీకాలా పనిచేస్తోందని యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనం చెబుతుంది.
పరిశోధన ఎలా జరిగిందంటే..
మానవ మెదడు ఎలా పనిచేస్తుందని తెలుసుకునే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సమకూర్చిన నిధులతో ఈ జాతీయ ప్రాజెక్టును చేశారు..దాదాపు 1200 మంది యువకుల నుంచి డేటాను సేకరించి వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న పని ఒత్తిడి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారేం చేస్తున్నారో మొదలైన వివరాల ఆధారంగా వచ్చిన ఫలితాన్ని యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఒత్తిడి అంటే ఎప్పుడూ భయపడేవారికి ఈ అధ్యయనంలో వెల్లడించిన అంశాలు కాస్త ఊరట కలిగిస్తాయని చెప్పుకోవాలి.
అయితే ఓ మాదిరి ఒత్తిడి ఓకే..అధిక ఒత్తిడి వల్లే లేనిపని సమస్యలు వస్తాయి అనేది ఈ అధ్యయనం సారాంశం.. ఇంతకీ మీ ఉద్యోగంలో ప్రజర్ ఉందా..?
-Triveni Buskarowthu