మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించింది : కె.లక్ష్మణ్

-

మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించిందని..బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ చురకలు అంటించారు. మోదీ, అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని… మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. దేశ ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మాత్యులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతోందనే భావన కేసీఆర్ లో కలిగినందువల్లే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోందన్నారు.

రైతులు, యువకులను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ రైతులను భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అపోహలను తొలగించింది. అయినా కూడా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు కేసీఆర్ పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేంద్ర మంత్రిపై లేనిపోని అభాండాలు వేయడం శోచనీయం. ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్ర మంత్రి చెప్పని విషయాలను ఆయనకు ఆపాదించడం సిగ్గు చేటు… మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎన్నో అబద్దాలాడారు. అందులో ముఖ్యమైనది సకాలంలో వర్షాలు పడి ధాన్యం దిగుబడి పెరిగితే… తాను నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంట దిగుబడి పెరిగినట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు లక్ష్మణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news