ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవిత ప్రమేయం ఉందని ఇప్పటివరకు అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన అమిత్ అరోరా ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఆ వెంటనే సీబీఐ..కవితని విచారించడానికి నోటీసులు కూడా జారీ చేసింది. కానీ మొదట ఇచ్చిన తేదీల్లో కవిత విచారణ చేయడం కుదరలేదు. దీంతో నేడు కవితని సిబిఐ విచారణ చేయడానికి కుదిరింది.
తాజాగా కవితని విచారించేందుకు సిబిఐ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కవిత నివాసానికి మొత్తం 11 మంది సీబీఐ అధికారులు వెళ్లారు. లిక్కర్ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితపై సీబీఐ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అలాగే సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే న్యాయవాదుల సమక్షంలో కవితను సీబీఐ బృందం ప్రశ్నిస్తుండటం గమనార్హం. కవిత స్టేట్మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. అలాగే ప్రత్యేక గదిలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ బృందం ప్రశ్నిస్తుండటంతో.. కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. విచారణ టీమ్‌లో ఓ మహిళ అధికారి ఉన్నారు. అలాగే ముందే న్యాయ నిపుణులు, కేసీఆర్‌తో పలుమార్లు చర్చించి..సలహాలు తీసుకుని కవిత విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
అయితే విచారణలో ఏం తేలుతుందో అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక లిక్కర్ స్కామ్‌లో కవిత దొరికిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. విచారణలో అన్నీ విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇక విచారణలో కవిత ఏం చెబుతారు..సిబిఐ ఏం తేలుస్తుంది..నిజంగానే కవిత స్కామ్‌లో ఇరుకున్నట్లేనా..లేదా ఆమె పాత్ర ఏమి లేదా అనే విషయాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.