అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతున్న సంగతి అందరికీ తెలుసు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు గులాబీ గూటికి వస్తున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో మాత్రం డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి కార్యకర్తలతో సమావేశమై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే..
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అయితే, ఈయన 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావును ఓడించారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కందాళ ఉపేందర్‌రెడ్డి గులాబీ గూటికి వచ్చారు. అప్పటి నుంచి పాలేరులో కారుకు రెండు స్టీరింగ్‌లు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తాజాగా ఆ లుకలుకలు కనబడుతున్నాయి. పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు.
ఈ మీటింగ్‌లో టీఆర్ఎస్ గ్రామస్థాయి నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యే కందాళ వర్గం తమ పట్ల అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని తుమ్మలకు తెలిపారు. తమను ఆదుకోవాలని, ఎమ్మెల్యే వైఖరి పట్ల స్పందించాలని, సూచనలు చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలకు సమాధనమిస్తూ తుమ్మల తర్వాత మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని, అంత వరకు పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఎవరూ అధైర్య పడొద్దని, రానున్న రోజులు మనవే అని తుమ్మల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలను అక్రమ కేసులతో అణచివేయాలనుకోవడం సరి కాదని, అది అవివేకమని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఎమ్మెల్యే గురించి తుమ్మల సీఎం వద్ద ప్రస్తావిస్తారేమో అనే చర్చ నియోజకవర్గంలో షురూ అయింది.