విశాఖ వైసీపీలో పెను మార్పులు..ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్టేనా ?

-

విశాఖ ఏజెన్సీ పై దృష్టిసారించింది అధికార వైసీపీ. అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ ఏజెన్సీ వైసీపీకి కంచుకోటగా ఉంది. రెండు దఫాలుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాంటి చోట పార్టీ ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణి పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దీంతో విశాక ఏజెన్సీలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ.

విశాఖ ఏజెన్సీలో గిరిజన ఓటర్లకు వైఎస్‌ కుటుంబంపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. ఇక్కడి ఆదివాసీలు ఫ్యాన్ గుర్తుతో కనెక్ట్ అవ్వడంతో జూనియర్లే అయినా ఆ నేతలను ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలను చేసి కంచుకోటను వాళ్ల చేతిలో పెట్టింది పార్టీ. కానీ స్థానిక ఎన్నికల్లో ఫలితాలు తేడా వచ్చాయి. దీంతో అరకు,పాడేరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. మళ్లీ పాత నేతకు కీలక పదవి అప్పగించి రిపేర్ చేసే పని మొదలెట్టింది. ఏపీ ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబును నియమించింది.

వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా పని చేసిన రవిబాబును మొదట 2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా నిలబెట్టాలనుకుంది వైసీపీ. అనూహ్యంగా గొడ్డేటి మాధవి పేరును పార్టీ ఖరారు చేసింది. అరకు ఎమ్మెల్యేగానైనా అవకాశం వస్తుందని రవిబాబు భావించినా.. ఎన్నికల కంటే రెండేళ్ల ముందు నుంచీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెట్టి ఫల్గుణకే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది. దీంతో రవిబాబును ఏజెన్సీలో ఎన్నికల సమన్వయకర్తగా నియమించి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయనకు అప్పగించింది.

అపారమైన ఖనిజ సంపద, పర్యాటక అద్భుతాలు కలిగిన ఆంద్రా ఊటిలో గతం కంటే భిన్నమైన రాజకీయాలు నడుస్తున్నాయనే చర్చ మొదలైంది. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు శాసనసభ్యుడు చెట్టిఫల్గుణలు తమ ప్రాధాన్యాన్ని నిరూపించుకునేందుకు ఫోకస్‌ పెట్టారట. ఇంతలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీలో కొత్త చర్చకు బాట వేశాయి. ప్రజలు, కేడర్‌ ఇద్దరూ ఎమ్మెల్యేలకు దూరమైనట్టు పార్టీ పెద్దలు గ్రహించారట. వైసీపీకి పట్టున్న ప్రాంతంలో టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుదారులు గెలవడాన్ని సీరియస్‌గా తీసుకుంది వైసీపీ.

పంచాయతీ ఫలితాలను చూసిన తర్వాత కంచుకోటకు బీటలు వారుతున్నాయనే చర్చ కూడా వైసీపీలో మొదలైంది. అంతర్గత రాజకీయాల వల్ల కొంతకాలం రవిబాబు నియామకం వాయిదా పడింది. ఇది ఆయన అభిమానులను నిరాశపర్చింది. అందుకే కుంభా రవిబాబును కేబినెట్ హోదా కలిగిన ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ చేసి.. అంతర్గతంగా పార్టీని సెట్‌రైట్‌ చేసే బాధ్యతను ఆయన చేతుల్లో హైకమాండ్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news