గ్యాస్ ధర తగ్గింపు.. ఇండియా కూటమి ఘనతే : మమతా బెనర్జీ

-

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందినవారికి సబ్సిడీ కింద ఇప్పటికే రూ.200 ఇస్తుండగా, ఈ తగ్గింపుతో వారికి రూ.400 ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు.

రెండు నెలల కాలంలో I.N.D.I.A. కూటమి కేవలం రెండు సమావేశాలు నిర్వహించిందని, ఈ రెండు సమావేశాల దెబ్బతో కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించిందన్నారు. ఇదే I.N.D.I.A. దమ్ము అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ట్వీట్ చేశారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆతిథ్యంలో జూన్ 23న పాట్నాలో 26 పార్టీల కూటమి ‘ఇండియా’ తొలి సమావేశం జరిగింది. ఆ తర్వాత కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ రెండో సమావేశాన్ని నిర్వహించింది. ‘ఇండియా’లో టిఎంసీ , ఆప్ , కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డిఎంకే , ఎన్ సీపీ , శివసేన మరియు జెఎంఎం వంటి అనేక పార్టీలు ఉన్నాయి.

 

మరోవైపు విపక్షాల కూటమి (ఇండియా) యొక్క మూడో సమావేశం గురువారం (ఆగస్టు 31), శుక్రవారం (సెప్టెంబర్ 1) మహారాష్ట్రలోని ముంబైలో జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఏ)ని ఓడించేందుకు ఈ కూటమి ఏర్పడింది. దీనిపై ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తూనే ఉన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version