తమిళనాడులో పరువు హత్య కలకలం.. కూతురు, అల్లుడిని నరికిచంపిన తండ్రి

-

ఒకే ఊరు వారిని ఒకరికొకరికి పరిచయం చేసింది. ఒకే ప్రాంతం వారిని మరింత దగ్గర చేసింది. రోజు ఒకరినొకరు చూసుకుంటూ ఎప్పుడు ప్రేమలో పడ్డారో వారికే తెలియదు. కొంతకాలానికి ఇద్దరు దూరపు బంధువులని తెలుసుకున్నారు. ఇక వారి పెళ్లికి ఏ అడ్డంకూ ఉండదని సంతోషంతో ఎగిరి గంతేశారు. తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడన్నట్లు.. వాళ్లు అనుకుంది జరగలేదు. వారి ప్రేమ గురించి ఇంట్లో తెలిసింది. అమ్మాయి తండ్రి వారి పెళ్లికి ససేమిరా అన్నాడు. తన కూతురికి దూరంగా వెళ్లిపోమని అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాడు.

పెద్దల వార్నింగ్ కి లొంగిపోయేందుకు వారిది ఉత్తుతి ప్రేమ కాదనుకున్నారు. ఏం చేసైనా ఇద్దరం కలిసే బతుకుదామనుకున్నారు. అందుకే తెగించి మూడ్రోజుల క్రితం స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు. వేరే ఇంట్లో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి కోపంతో ఊగిపోయాడు. తన పరువు తీసిన కూతురు ఉన్నా లేకున్నా ఒకటే అనుకున్నాడు. అంతే కట్టలు తెంచుకున్న ఆవేశంలో వారి ఇంటికి వెళ్లి కూతురు, అల్లుడిని అక్కడికక్కడే నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తూతుక్కుడిలో చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు రేష్మ(20), మానికరాజ్(26)గా గుర్తించారు. వారిని హత్య చేసి పరారైన రేష్మ తండ్రి ముతుకుట్టి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మూడు గంటల్లో ముతుకుట్టిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతీయువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోవిల్పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version