పాతుకుపోయిన ‘మెడికల్’ ఊడలు.. క‌ట్ చేయాల్సింది అక్క‌డి నుంచే క‌దా..?!

-

మెడికల్ సీట్ల దందా.. తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది.మెడికల్ కాలేజీలు ఉన్నఇద్దరు మంత్రులే టార్గెట్ గా కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించడం..ఏకంగా గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. మరి మెడికల్ భాగోతాలు మన ఒక్క రాష్ట్రానికే పరిమితమా? అంటే కాదన్నది సుస్పష్టం.ప్రభుత్వాలు ఏవయినా మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతిరాష్ట్రంలో సీట్ల దందా సర్వసాధారణంగా మారిపోయింది. వివాదం వ‌చ్చిన‌ప్పుడు తొడ‌లు గొట్ట‌డాలు..స‌ద్దుమ‌ణ‌గ‌గానే మ‌ర్చిపోవ‌డాలు నిత్య‌కృత్యంగా మారాయి.

మధ్యప్రదేశ్ లో ‘వ్యాపం కుంభకోణం’ ఎన్ని సంచలనాలకు వేదికైందో తెలుసు. ఈ కేసుతో సంబంధమున్న వారిలో అనేక మంది అనుమానాస్పది రీతిలో చనిపోవడం కూడా తీవ్ర కలకలం కలిగించింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వివాదంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనేక మంది అధికార పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రీ మెడికల్ టెస్ట్‌లో అవకతవకలు, ఫోర్జరీలు జరిగినట్లుగా 2013లో కుంభకోణం వెలుగులోకిరాగా 2015, జూన్ నాటికి 2,000 మందికి పైగా అరెస్టయ్యారు.

ఈ ఏడాది జనవరిలో జిప్‌మర్‌లో పుదుచ్చేరి కోటాకు సంబంధించి వెలుగులోకి వచ్చిన రెండు ప్రాంతాల స్థానికత అంశం తీవ్ర వివాదం కలిగించింది.దాంతో జిప్‌మర్‌ యాజమాన్యం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అది ఎంతవరకు వచ్చిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

ఉత్తరప్రదేశ్‌లో గత ఏడాది ఫిబ్రవరిలో అయితే ఏకంగా ఓ మెడికల్ కాలేజీ యాజమాన్యం నీట్ పాస్ కాకున్నా రూ.30 లక్షలు కట్టించుకుని సీట్లు ఇచ్చేసింది.ఇది వివాదం కావడంతో వారికి కేటాయించిన సీట్లను రద్దు చేశారు. కానీ డబ్బులు చెల్లించిన పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ర్ట, హర్యానాకు చెందిన విద్యార్థులు నిలువునా మునిగిపోయారు. పైగా వారిపై కేసులు నమోదవడంతో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

2019లో కర్ణాటకలో వెలుగచూసిన కుంభకోణం కలకలం అంతా ఇంతా కాదు.ప్రభుత్వ కోటా సీట్లను అక్రమంగా ఇన్‌స్టిట్యూషన్‌ కోటా సీట్లుగా మార్చి అమ్మేసుకున్నారు.ఐటీ అధికారులు ఐదు కాలేజీలపై దాడులు చేసి ఏకంగా రూ.300 కోట్లు సీజ్‌ చేశారు. పలు ప్రైవేట్‌ కాలేజీల్లో 113 మేనేజ్మెంట్‌ కోటా మెడికల్‌ పీజీ సీట్లను కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా భర్తీ చేసినట్టు కూడా తేలింది.ఇలా మెడికల్ కాలేజీలు అక్రమాలకు కేంద్రాలకు మారడానికి కారణం సీట్ల కొరత అన్నది సుస్పష్టం.

డిమాండ్ ఎక్కువ సప్లయ్ తక్కువ ఉన్నప్పుడే అక్రమాలకు తావుంటుంది. ఇదే ఆసరాగా కాలేజీ యాజమాన్యాలు అక్రమ దందాకు తెరలేపుతున్నాయి. ఇందుకు ఏ రాష్ట్రమైనా.. ఏ ప్రభుత్వమయినా మినహాయింపు లేదు. మెడికల్ సీట్లకు సంబంధించి ఏటా ఏదో ఒక వివాదం తెరపైకి వస్తున్నా.. నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోవడమే పెద్ద సమస్య. ఉదాహరణకు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలనే నిబంధన ఉంది. దాంతో..కొత్త కాలేజీల స్థాపన కష్టంగా మారింది. ఇంత పెట్టుబడి పెట్టలేక ఎవరు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో. వాటిని పరిష్కరించగలిగితేనే ఈ సీట్ల అమ్మకాలకు కొనుగోళ్లకు బ్రేక్ పడగలదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version