ప్రజలకు సేవచేసే మంచి గుణమున్న బీసీ నాయకుడు ఒద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ కు పంపుతున్నదుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనట్లు ఒద్ధిరాజు రవిచంద్ర సోమవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఒద్దిరాజు రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు అమలుచేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని అడిగారు. ఎన్నికల కోసం కొంతమంది బ్రోకర్‌గాళ్లు మాట్లాడితే ఎవరూ నమ్మరన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో జయశంకర్ సార్‌ను కలిశాడా? అని ప్రశ్నించారు. జేఏసీ మీటింగ్ కు ఎప్పుడైనా వచ్చాడా? అని అడిగారు. అలాంటి మూర్ఖుడు ఇప్పుడు జయశంకర్‌సార్ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జయశంకర్‌సార్ తన గురువని, ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేసింది తామేనన్నారు. కావాలంటే రేవంత్‌రెడ్డి తనతో కలిసి జయశంకర్‌సార్ గ్రామానికి రావొచ్చన్నారు.