పీహెచ్‌సీ, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశాల పనితీరుపై నిర్వహించే నెలవారీ సమీక్షలో భాగంగా ఇవాళ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆశాలు, ఏఎన్ఎంలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు.. వైద్య రంగానికి మూలస్తంభాలు అని ప్రశంసించారు. రోగులను ప్రాథమిక దశలోనే గుర్తించి, అవసరమైన వైద్యం అందిస్తే, వ్యాధి ముదరకముందే రోగిని కాపాడుకోవచ్చన్నారు మంత్రి హరీశ్‌రావు. కేవలం రోగులను కాపాడిన వాళ్లమే కాకుండా, రోగి కుటుంబం వైద్యం కోసం అప్పుల్లో పడకుండా, ఆర్థికంగా కుంగిపోకుండా కాపాడిన వాళ్లం అవుతామని చెప్పారు మంత్రి హరీశ్‌రావు. కేసీఆర్ న్యూట్రిషిన్ కిట్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి హరీశ్‌రావు. 9 జిల్లాల్లో రక్త హీనత, పోషకాహర లోపం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరుగుతుందన్నారు మంత్రి హరీశ్‌రావు.
గర్భిణీ స్త్రీకి అవసరమైన స్కానింగ్‌లు చేయించాలని సూచించారు. 56 టిఫా స్కాన్ యంత్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ యంత్రాలు నిర్వహించే తీరుపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టిఫా స్కాన్ మిషన్లు వినియోగించి నాణ్యమైన వైద్యం తల్లిపిల్లకు అందించాలి. స్కానింగ్‌ల కోసం బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. డెలివరీ తేదీని ముందే గుర్తించి 104 వాహనంలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు మంత్రి హరీశ్‌రావు.