మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. 55 ఏండ్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదని ధ్వజమెత్తారు. పాదయాత్రలు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడని, 10 ఛాన్స్‌లు ఇచ్చారన్నారు. 50 ఏండ్లు అవకాశం ఇచ్చిన్పపుడు కరెంట్, నీళ్లు, విద్య ఇవ్వనోడు.. ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడన్నారు మంత్రి కేటీఆర్. ఇలా అడగడంతో వాళ్లు పిచ్చొళ్లా…? మనం పిచ్చొళ్లామా..? ఆలోచించాలి అని మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న మొన్నటి దాకా మనల్ని చావగొట్టింది కాంగ్రెసోళ్లే. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు.
పెన్షన్లు ఇవ్వడం చేతకాలేదు. అసలు కాంగ్రెస్‌కు ఎందుకు ఇవ్వాలి ఛాన్స్‌లు. కాంగ్రెసోళ్లను పట్టించుకోవద్దు. అద్భుతమైన ఎమ్మెల్యే హన్మంత్ షిండేను 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. అవకాశం, అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేనోడు.. ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపూరిత మాటలకు మోసపోవద్దు అని కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.