మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు గట్టుప్పల్‌లోని పుట్టపాక రోడ్డు నుంచి రోడ్ షో ప్రారంభమైంది. పుట్టపాక రోడ్డు నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం, మార్కండేయ గుడి, బొడ్రాయి బజార్, కనకదుర్గమ్మ గుడి, వివేకానంద చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. అక్కడ ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. మన్నెగూడలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణలో కరెంటు సమస్య తీరిపోయిందని తెలిపారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంటి ముందే నల్లా ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రైతు ధీమాగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడని వివరించారు.