ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ సమర్థవంతంగా నెరవేర్చుతున్నారని అన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి వెంకట నాగేశ్వరరావు. మంగళవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తణుకు నియోజకవర్గ పరిధిలోని మహిళలకు మంజూరైన 10 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ చెక్కును మహిళలకు అందజేశారు.
అంతేకాకుండా మహిళలతో పాటు ఆయన కూడా సీఎం జగన్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 207 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తే, వైసీపీ ప్రభుత్వ 2 ఏళ్ల 10 నెలల కాలంలో 878 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తితో పరిశీలిస్తున్నారన్నారు. మూడుసార్లు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గుర్తింపు పొందారని ఆయన గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. ప్రతి పథకాన్ని ఎంతో పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు.