ఏపీ ఇంధన శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బాధ్యతలు చేపట్టిన నుంచి విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జీవ వైవిధ్యం పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బయో డైవర్సిటీ యాక్ట్ – 2002 సవరణలపై కేంద్రం ప్రతిపాదనలను మంత్రికి అధికారులు వివరించారు. అన్ని రాష్ట్రాల బోర్డ్ లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తమ సిఫారస్‌లను పంపాలని కేంద్రం కోరిన విషయాన్ని మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.
కేంద్ర ప్రతిపాదనలపై జీవ వైవిధ్యానికి విఘాతం లేకుండా సహేతుకమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా బయో డైవర్సిటీ బోర్డ్ నిబంధనలను అన్ని పరిశ్రమలు, సంస్థలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మానవాళి మనుగడతో పాటు జీవ వైవిధ్యంను కూడా కాపాడుకోవాలని ఆయన సూచించారు. ప్రజల్లో ఈ మేరకు అవగాహనను పెంచాలని ఆయన అధికారులకు నిర్దేశించారు.