ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి టీడీపీ విమర్శలు గుప్పించారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. తాజాగా ఆమె గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 20 చొప్పున 108, 104 వాహనాలను ఏపీఐఐసి బిల్డింగ్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆరోగ్య రంగానికి పునాది వేశారన్నారు. అంతేకాకుండా.. ఆయన తనయుడు జగన్ వైద్య రంగాన్ని మెరుగు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు మంత్రి రజని. చంద్రబాబు ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు రెండు మెడికల్ కాలేజిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి రజని. 104, 108 వాహనాల ద్వారా ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు 25 వేల మందికి అందిస్తామని మంత్రి రజని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ , చంద్రబాబుల ముసుగు తొలగిపోయిందని మంత్రి రజని విమర్శించారు. విశాఖపట్నం సంఘటనను అడ్డు పెట్టుకొని బయటపడ్డారని మంత్రి రజని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ భాష దారుణంగా వుందని, విశాఖపట్నం గర్జన విజయవంతం కావడంతో డైవర్టు చేసేందుకు పవన్ కళ్యాణ్ అలజడి సృష్టించారని మంత్రి రజని ఆరోపించారు. బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి రజని హితవు పలికారు.