తెలంగాణలోని రైతులకు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగ రావు షాకింగ్ విషయాన్ని చెప్పారు. వ్యవసాయ రంగానికి వాడుతున్న విద్యుత్ లెక్కలు తీయాలని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగ రావు అన్నారు. వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లతో పాటు ఫీడర్ల వద్ద కూడా మీటర్లు పెట్టాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 25 లక్షలకు చేరిందని అన్నారు. లక్షకుపైగా అనధికార కనెక్షన్లు ఉన్నాయని, వాటిని రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత డిస్కలపై ఉందని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నందున రైతులు దాన్ని పొదుపుగా వాడుకోవాలని శ్రీరంగ రావు సూచించారు.
8 ప్రభుత్వ శాఖలు డిస్కంలకు రూ.20,841 కోట్ల బకాయిలు ఉన్నాయని శ్రీరంగరావు చెప్పారు. ఒక్క ఇరిగేషన్ శాఖ రూ. 9,268 కోట్ల బకాయి ఉందని వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు భారీగా కరెంట్ వినియోగిస్తున్నారన్న ఆయన.. ప్రభుత్వం ఈక్విటీ ద్వారా రూ.7,961 కోట్లు అందించిందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, అన్ని కేటగిరీలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు డిస్కంలను మెరుగుపరిచే బాధ్యత వినియోగదారులపై కూడాఉందని శ్రీరంగ రావు అభిప్రాయపడ్డారు. ఏఆర్ఆర్ లో విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పలేదని స్పష్టం చేశారు.