జగ్గారెడ్డి ‘కారు’ పయనం?

-

మొదట నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన దారి తనదే అన్నట్లు ముందుకెళుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి…ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేయనున్నారు. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి జగ్గారెడ్డి వైఖరిలో మార్పు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అసలు పి‌సి‌సి పదవి కోసం జగ్గారెడ్డి ట్రై చేసిన సంగతి తెలిసిందే…కానీ పదవి రేవంత్‌కు రావడంతో జగ్గారెడ్డి బాగా హార్ట్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చిన సంతృప్తిగా లేరు.అప్పుడు నుంచి ఏదొక విధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజకీయం నడిపిస్తూనే ఉన్నారు.

అలాగే తనకు రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి..ఆ మధ్య రేవంత్‌ని పి‌సి‌సి పదవి నుంచి తొలగించాలని ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాశారు. ఇలా ఏదొకవిధంగా రేవంత్‌కు యాంటీగానే జగ్గారెడ్డి ముందుకెళుతున్నారు. ఇక ఆ మధ్య కేటీఆర్ సంగారెడ్డి టూర్‌కు వచ్చినప్పుడు జగ్గారెడ్డి చాలా సన్నిహితంగా మెలిగిన విషయం తెలిసిందే. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని జాగ్రత్తగా చూసుకోవాలని జగ్గారెడ్డికి కేటీఆర్ సూచించడం కూడా కాస్త సంచలనమైంది.

ఇలా కాంగ్రెస్‌లో ఉంటూ రేవంత్‌కు వ్యతిరేకంగా కేటీఆర్‌తో సఖ్యతతో ఉండటంతో..జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అని రేవంత్ వర్గం తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది..ఆయన ఖచ్చితంగా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇలా రేవంత్ వర్గం తనని టార్గెట్ చేయడంపై జగ్గారెడ్డి తీవ్రంగా హార్ట్ అయ్యారు..ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా ఉంటానని అంటున్నారు.

అయితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారని తమకు ఎప్పుడో తెలుసని రేవంత్ వర్గం అంటుంది..పైగా జగ్గారెడ్డి ఇండిపెండెంట్‌గా ఉండరని, ఆయన ఖచ్చితంగా టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని, ఇండిపెండెంట్‌గా ఉంటున్నట్లే ఉండి…టీఆర్ఎస్‌తో సఖ్యతతో ముందుకెళ్తారని, కుదిరితే ఇప్పుడు లేదంటే ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ కండువా కప్పేసుకుంటారని రేవంత్ వర్గం చెబుతుంది. మరి చూడాలి జగ్గారెడ్డి కారు ఎక్కుతారో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news