చక్రం తిప్పుతున్న ఈటల! ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్

-

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌కు గుబులు రేపుతున్నది. హుజూరాబాద్ ఫలితం పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. నామినేషన్లకు ఉపసంహరణకు మరికొన్న గంటలే సమయం ఉండటం, రవీందర్ సింగ్ అజ్ఞాతం వీడకపోవడంతో టీఆర్‌ఎస్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రవీందర్ వెనుక హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చక్రం తిప్పుతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఇప్పటికే ఆరు ఏకగ్రీవమయ్యాయి. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఒకటి చొప్పున రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు టీఆర్‌ఎస్ ఖాతాలో పడినట్టే లెక్క. కానీ, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకుగాను 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులోనూ టీఆర్‌ఎస్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీలో ఉండటం వెనుక పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1326 ఓట్లు ఉండగా, టీఆర్ఎస్‌కు 825, కాంగ్రెస్‌కు 213, బీజేపీ‌కు 105, ఎంఐఎం‌కు 11, స్వతంత్రులు 145 మంది ఉన్నారు. రవీందర్ సింగ్‌కు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది. వీరి ఓట్లతోనే గెలిచే అవకాశాలు కష్టమే. టీఆర్‌ఎస్‌కు చెందిన కొంత మంది ఓటర్లు రవీందర్ సింగ్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు జరుగుతున్న ప్రచారమే అధికార పార్టీని గుబులు రేపుతున్నది. రెండు స్థానాలకుగాను ఒకటి టీఆర్‌ఎస్ మరొకటి రవీందర్ సింగ్ వేయాలని ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే తత్వం బోధపడిన టీఆర్‌ఎస్ అధిష్ఠానం మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది. ఎప్పటికప్పుడు టచ్ ఉంటూ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎలాగైనా రవీందర్ సింగ్‌ను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయాలని ప్రయత్నిస్తున్న సమాచారం. అయితే, నామినేషన్ వేసిన రోజు నుంచే రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అధికార పార్టీ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతున్నది.

మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెనుక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. టీఆర్‌ఎస్ క్యాంపులోని తన కోవర్టుల ద్వారా ఒక ఓటు టీఆర్‌ఎస్, మరో ఓటు రవీందర్‌కు అన్నట్లు ప్రచారం చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకున్న ఈటల హుజూరాబాద్, మంథని, మానకొండూరు, కరీంనగర్ నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ ఓట్లను రవీందర్ సింగ్ వైపు తిప్పే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగియనున్నది. ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ చివరి వరకు పోటీలో ఉంటారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి నామినేషన్ ఉపసంహరించుకుంటారా? లేక చివరి వరకు పోటీలో ఉండి టీఆర్‌ఎస్‌కు షాకిస్తారా? అనే విషయం సాయంత్రం 5గంటల లోపు తేలిపోనున్నది.

Read more RELATED
Recommended to you

Latest news