ఆఫ్రికాలోని బంగారు గనుల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గనుల తవ్వకాల సమయంలో కార్మికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో వంద మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే వంద మంది మరణించినట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవ మరణాలు 100కుపైగా ఉండవచ్చని అంచనా. అలాగే చాలా మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే ఈ ఘర్షణకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
ఆఫ్రికా దేశమైన చాద్‌లో వర్గ పోరు సహజం. ముఖ్యంగా అక్కడి స్థానికులు, రైతులు, సంచార పశువుల కాపర్ల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉత్తర చాద్‌లోని కౌరీ బౌగౌడీ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లోని బంగారు గనుల్లో హింసాకాండ నెలకొంది. ఈ ఘటనలో వందల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు లిబియా ఫ్రంట్ ఫర్ ఛేంజ్ అండ్ కాంకర్డ్ ఇన్‌చాద్ నివేదిక వెల్లడించింది. టామా వర్గానికి, అరబ్ వర్గానికి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.