శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి సభ ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సభకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ సభలో నాగబాబు ప్రసంగిస్తూ.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువశక్తిని నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది, వారిని పరిపాలనలో భాగస్వాములను చేసే పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు “హమ్ దేఖేంగే… హమ్ దేఖేంగే” అంటూ పాకిస్థానీ కవి ఫయాజ్ అహ్మద్ రాసిన ఓ స్ఫూర్తిదాయక గీతాన్ని చదివి వినిపించారు.
మీ నియంతృత్వ పోకడలు ఉన్న ప్రభుత్వ పతనాన్ని మేం చూడడం తథ్యం… తారాస్థాయికి చేరిన మీ క్రూరత్వం, మీ అణచివేత దూదిపింజెల్లా ఎగిరిపోవడం మేమందరం చూస్తాం… ఇది తథ్యం ఇది తథ్యం అంటూ ఆ గీతం సారాంశాన్ని వివరించారు నాగబాబు. పాకిస్థాన్ నియంతగా పేరుగాంచి జియావుల్ హక్ కోటను ఈ పాట కూల్చివేసిందని అన్నారు. ఈ గీతం అంత చైతన్యం కలిగించిందని తెలిపారు నాగబాబు. ఇంకొక విషయం చెప్పాలి. మన నాయకుడు పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు… ముఖ్యమంత్రి అవుతారు… ఇది తథ్యం. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నాగబాబు వ్యాఖ్యానించారు.