తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ క్రమంలోనే వైరా వాసవీ కల్యాణమండపంలో మున్సిపాలిటీ స్థాయిలో పది వార్డులకు జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంకు బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం పగటి కలలాంటిదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేనేలేదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని మిళితం చేసి తెలంగాణను ప్రగతిపథంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని వివరించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, అందువలన వైరా నియోజకవర్గంలో కారు గుర్తును అత్యధిక మెజారీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని జోష్యం చెప్పారు. బీజేపీ మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను బెదిరిస్తుందని ఆరోపించారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని వివరించారు.