నటుడు ప్రకాశ్ రాజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్ మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ నోటీసులిచ్చింది. చెన్నైలోని ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని ఆదేశించింది. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు.. ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధిక రిటర్న్స్ ఇస్తామని ఈ మొత్తం సేకరించారని పేర్కొన్నారు. ఈ సంస్థకు ప్రచారకర్తగా ప్రకాష్ రాజ్ వ్యవహరించి ఫీజు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థలో సంబంధాలు ఉన్నందున ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీ ని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు మోదీకి వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే బీజేపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తుల ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. కర్ణాటకలో గతంలో గౌరీ లంకేష్ అనే రచయితను హత్య చేశారు. ఇది పూర్తిగా మత చాందసవాదుల మద్దతుతోనే జరిగిందని..దీనికి బీజేపీనే కారణం అని ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు ప్రారంభించారు.