బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకోవచ్చా..? : ఆనంద్ మహీంద్రా ఫన్నీ ప్రశ్న

-

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన దృష్టికి వచ్చిన వీడియోస్ ను, విషయాలను పోస్టు చేస్తుంటారు. సోషల్ మీడియాను తరచూ వినియోగించే ఆనంద్ మహీంద్రా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తక్షణమే స్పందించి వారికి సాయం చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనిపిస్తే ఆ పోస్టులను రీపోస్ట్ చేస్తూ.. అందరి దృష్టి పడేలా చేస్తారు. ప్రస్తుతం అలాంటి ఓ విషయాన్ని సోషల్ మీడియాలో తన ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆన్‌లైన్‌లో మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునే వెసులుబాటు గురించి అందరికీ తెలిసిందే. బీమా కవరేజీలు, ప్రభుత్వ పింఛన్ల సమయంలో ఈ పత్రం ఎక్కువగా అవసరపడుతుంది. అయితే చనిపోకముందే మన డెత్‌ సర్టిఫికేట్‌ను మనమే తీసుకోవచ్చా..? అదేంటీ అలా అడుగుతున్నారు? బతికుంటే ఆ పత్రంతో పనేంటీ? ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి కదూ..! అచ్చం ఇలాంటి ఆప్షన్‌తోనే ఓ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఉందట. అందుకు సంబంధించిన ఫొటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా పోస్ట్ చేశారు.

ఆన్‌లైన్‌లో డెత్‌ సర్టిఫికేట్‌ పొందే ఓ వెబ్‌సైట్‌ స్నాప్‌షాట్‌ను మహీంద్రా నేడు తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అందులో ఆసక్తికరమైన విషయమేంటంటే.. మరణ ధ్రువీకరణ పత్రం ఎవరికోసమంటూ రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి ‘MySelf’ అని ఉండటంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. ఈ ఫొటోను మహీంద్రా షేర్‌ చేస్తూ.. ‘మరో జన్మ ఉందని విశ్వసించేవాళ్లం మనం మాత్రమే కాదు’’ అని రాసుకొచ్చారు. ఎందుకంటే.. ఈ వెబ్‌సైట్‌ అమెరికాలోని నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని మెక్‌లెంగ్‌బర్గ్‌ కౌంటీ ప్రభుత్వానికి చెందినది మరి.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగి ఉంటుందని చాలా మందికి తెలిసినప్పటికీ.. దీనిపై జోకులు పేలుతున్నాయి. మన దేశంలో చనిపోయిన వాళ్లు ఓట్లేస్తున్నప్పుడు ఇదేమంత పెద్ద విషయం కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news