కేంద్ర సర్కార్‌పై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త నియమాలు మరీ విపరీతంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. ఒక చీమను చంపేందుకు సుత్తిని వాడలేం కదా? అని ప్రశ్నించింది.
కేంద్రం ఐటీ నిబంధనలకు చేసిన సవరణలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ కంటెంటులో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో పేర్కొంది. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు ఇటీవల సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న ఈ క్రమంలో ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.