యుపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
వరకట్నం ఒక సాంఘిక దురాచారమన్న సీఎం యోగీ
మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి
బాల్యవివాహాలు,వరకట్నం కోసం వేధింపులు ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలివి.మహిళల అభివృద్ధికి ఇవి అడ్డంకిగా మారాయి. తరచూ ఈ అసాంఘిక కార్యకలాపాలపై ఉద్యమాలు జరిగినా జనాల్లో మార్పు రాని కారణంగా మహిళలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు.ఇక యూపీలో ఈ దురాచారాలను వదిలేయాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. యూపీలోని చంపాదేవి పార్కులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకకు యోగి హాజరయ్యారు. ఈ సామూహిక వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైన 1500 జంటలను ఆయన ఆశీర్వదించారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, సాధికారత కల్పించేందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారి భరోసా కల్పించారు.
సగం జనాభాను విస్మరించడం ద్వారా ఏ సమాజమూ బలంగా ఉండదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సగం జనాభా సాధికారత లేకుండా అభివృద్ధి సాకారం కాదని చెప్పారు. సమాజ సాధికారత కోసం, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలని పిలుపునిచ్చారు.సాధికారత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.ఈ విషయాన్ని గ్రహించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, డబుల్ ఇంజన్ ప్రభుత్వం మహిళల గౌరవాన్ని రెట్టింపు చేయడానికి మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని అన్నారు.
వరకట్నం ఒక సాంఘిక దురాచారమని, వరకట్న రహిత వివాహం కోసం సమాజమంతా ఉద్యమించాలని ఈ సందర్భంగా యోగీ పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 2017 నుంచి ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా వివాహాలు నిర్వహించిందన్నారు.2017కి ముందు ఒక్కో జంట పెళ్లికి రూ.31 వేలు ఖర్చు చేయగా, తర్వాత దానిని రూ.51 వేలకు పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలు పుట్టినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు.మిషన్ శక్తి అభియాన్ మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబడుతోంది. యుపీ ప్రభుత్వం పోలీసు రిక్రూట్‌మెంట్‌లో 20 శాతం మంది మహిళలను నియమించడాన్ని తప్పనిసరి చేసిందని సీఎం తెలిపారు.