గుజరాత్‌ వైపు దూసుకొస్తున్న ‘బిపోర్‌జాయ్‌’.. అప్రమత్తమైన సర్కార్

-

బిపోర్‌జాయ్‌ తుపాను గుజరాత్‌ వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం జఖౌ పోర్టు వద్ద తీరం దాటుతుందని చెప్పారు. తీరాన్ని తాకేటప్పుడు 150 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. దీని ప్రభావంతో కెరటాలు ఇప్పటికే ఎగసిపడుతున్నాయని వెల్లడించారు. ఎల్లుండి కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం అరేబియా తీరప్రాంతాల్లో విపత్తు బృందాలను సిద్ధం చేసింది. తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కచ్, పోర్‌బందర్, ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బీలో తరలింపు ప్రక్రియ షురూ చేసింది. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం పోర్‌బందర్‌కు 290, జఖౌకు 360 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైందని.. తుపాను హెచ్చరికలతో చేపలవేటను నిషేధించామని సర్కార్ తెలిపింది. ప్రస్తుతం 12 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. మరో 15 బృందాలు స్టాండ్‌బైలో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం, నౌకా, కోస్టుగార్డు దళాలతో అధికారులు సన్నద్ధంగా ఉందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version