దేశ రాజధాని దిల్లీలో నిన్నటిదాక యమునా నది మహోగ్రరూపం దాల్చి ప్రజలను భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి యమున కాస్త శాంతించింది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోన్న యమునా నది నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటు యమునా ప్రవాహం తగ్గినా.. దిల్లీ వాసులు ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు. నగర వాసులు మాత్రం పూర్తిగా జలదిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ, శాంతి వాన్ ఏరియా, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ సమీపంలో, ఇంకా పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి.
ఇవాళ ఉదయానికి యమునా నదిలో నీటి మట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే రెండు మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ.. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడం కాస్త సంతోషించాల్సిన విషయం. అయితే ఇంకా వరద నుంచి బయటపడని దిల్లీ నగరానికి ఈరోజుకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న 3-4 రోజులు దిల్లీ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది.