దేశంలో కోవిడ్ రెండో వేవ్ ప్రభావం ఇంకా తగ్గనప్పటికీ మూడో వేవ్ వచ్చే నెలలోనే వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కేరళలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో అక్కడ మూడో వేవ్ వచ్చిందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 30,000 కు పైగా కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 3 నెలల తరువాత అక్కడ టెస్ట్ పాజిటివిటీ రేట్ 19 శాతానికి చేరుకోవడం గమనార్హం.
కేరళలో బుధవారం ఒక్క రోజే కొత్తగా 31,445 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 24 గంటల్లో 215 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 38,83,429కి చేరుకుంది. దీంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది. కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
కేరళలో తాజాగా ఓనమ్ పండుగ నిర్వహించారు. అందువల్ల కేసుల సంఖ్య పెరిగేందుకు ఆ పండుగ కూడా ఒక కారణమైందని తెలుస్తోంది. దీంతో పాజిటివిటీ రేటు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జూలై 27వ తేదీన బక్రీద్ నుంచి అక్కడ ఆంక్షలను సడలించారు. తరువాత కొద్ది రోజులకే రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు పైగా చేరుకుంది. అప్పటి నుంచి అదే విధంగా కేసులు నమోదవుతున్నాయి.
అయితే తాజాగా కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మూడో వేవ్ కేరళలో వచ్చిందా ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పదు.