కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ ని ప్రవేశపెట్టడంతో వరుసగా ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు. ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు. 1959 నుంచి 1964 వరకు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన దేశాయ్.. ఆరు సార్లు రికార్డు స్థాయిలో బడ్జెట్లు సమర్పించారు. వాటిలో ఐదు పూర్తి బడ్జెట్లు మరియు ఒకటి మధ్యంతర బడ్జెట్. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 1 ఫిబ్రవరి 2024న సమర్పించబడింది.
బడ్జెట్ సన్నాహాల్లో భాగంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వివిధ వాటాదారులతో అనేక రౌండ్ల సంప్రదింపులను పూర్తి చేశారు. ఈ సమావేశాలు జూన్ 20న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామన్ ట్రేడ్ యూనియన్లు, విద్య మరియు ఆరోగ్య రంగం, ఉపాధి మరియు నైపుణ్యాలు, ఎంఎస్ఎమ్ఎస్ఈ, వాణిజ్యం, సేవలు, పరిశ్రమలు, ఆర్థికవేత్తలు, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్ల ప్రతినిధులతో పాటు మౌలిక సదుపాయాలు, ఇంధనం, పట్టణ రంగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.