విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) శుభవార్త చెప్పింది. శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్‌లోనే తమ వెంట తీసుకువెళ్లొచ్చు. ఇందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అనుమతించింది. ఎయిర్‌పోర్టులో అన్ని తనిఖీలు ముగిసిన తర్వాత ఇరుముడిని క్యాబిన్‌లోకి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు అనుమతించాలని అన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సర్క్యులర్ జారీ చేసింది. అయితే మండలం, మకరజ్యోతి దీక్షలు ముగిసేవరకు(జనవరి 20) మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని బీసీఏఎస్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
శబరిమలను ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. వారిలో ఎక్కువ మంది ‘ఇరుముడి కెట్టు’ (నెయ్యితో నింపిన కొబ్బరికాయతో సహా నైవేద్యాలను కలిగి ఉన్న పవిత్ర సంచి)ని తీసుకువెళతారు. అయితే కొబ్బరికాయలు మండే అవకాశం ఉన్నందున క్యాబిన్ బ్యాగేజీలో అనుమతించబడవు. ఇటీవల భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పరిమిత కాలం పాటు అయ్యప్ప భక్తులకు బీసీఏఎస్ ఈ వెసులుబాటును కల్పి్ంచింది. శబరిమలలోని అయ్యప్ప దేవాలయం రెండు నెలల సుదీర్ఘ తీర్థయాత్ర కోసం నవంబర్ 16న తెరవబడింది. జనవరి 20న ముగుస్తుంది.