హమారా సఫర్ : యుద్ధం.. రష్యాకూ ఇష్టం లేదు కానీ!

-

యుద్ధం వ‌ద్ద‌నుకున్నాక మాత్ర‌మే దేశాలు మ‌రింత సౌభ్రాత‌త్వాన్ని పెంపొందించుకుంటాయ‌న్న‌ది ఓ నిర్థార‌ణ.కానీ ఇప్పుడు ఇరు దేశాలూ ప్ర‌పంచ ఆర్థిక పురోగ‌తినే స‌వాలు చేస్తున్నాయి.ఓ వైపు మ‌ర‌ణం మరోవైపు అంతే లేని వినాశ‌నం ఇవ‌న్నీ ఇరు దేశాల‌నూ శాసిస్తూ ఉన్నా కూడా కొత్త ఆయుధాల వెతుకులాటలో ఎవ‌రి ప్రాధాన్యం వారిదే అన్న విధంగానే ఉంది.దీంతో వివాదం ముదిరి,ఆర్థిక రంగంతో స‌హా ఎన్నో వ్య‌వ‌స్థ‌ల‌ను ఛిద్రం చేస్తున్నాయి.క‌రోనాతో కోలుకున్న మార్కెట్ల‌కు మళ్లీ చావు దెబ్బ కొడుతున్నాయి. ఆర్థిక ఆంక్ష‌లు విధించి ర‌ష్యాను దార్లోకి తెచ్చుకోవాల‌ని కొన్ని దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నా కూడా పుతిన్ ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.

అమెరికా మాత్రం ఆయుధాల అమ్మ‌కానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ యుద్ధం త‌మ‌కొక అంతర్గ‌త స‌మ‌స్య‌గా ప్ర‌క‌టించి, అక్క‌డి నుంచి ల‌బ్ధి పొందాల‌ని చూస్తోంది.కానీ బైడెన్ మాటను కానీ ఇంకా ఇత‌ర అమెరికా అనుకూల దేశాల మాట‌లు కాని వినేందుకు లేదా వినిపించుకునేందుకు పుతిన్ పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదని తేలిపోయింది.ఇక యుద్ధం వ‌ద్దేవ‌ద్ద‌ని ర‌ష్యా పౌర స‌మాజం కూడా కోరుకుంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. యుద్ధం త‌రువాత వ‌చ్చే ఆర్థిక ఆంక్ష‌ల‌ను త‌ట్టుకునే శ‌క్తి ఇవాళ త‌మ దేశానికి లేద‌ని కూడా మొత్తుకుంటున్నాయి. అయినా కూడా యుద్ధ కాంక్ష‌లకు అనుగుణంగానే పుతిన్ ఉంటున్నారు.

ఆ ప‌క్కా నాదే ఈ ప‌క్కా నాదే
త‌ల‌పైన ఆకాశం ముక్కా నాదే
అని పుతిన్ అంటున్నారు.

అంటే అన‌నీయండి కానీ శ‌త్రుదేశ గ‌గ‌న త‌లం మొత్తం త‌మ స్వాధీనంలో ఉంద‌ని కూడా అంటున్నాడు.అంటే అన‌నీయండి. కానీ ఇరు దేశాల కొట్లాట‌ను మ‌రో దేశం ముందుకు వ‌చ్చి ఆప‌డం లేదు.త‌న చేతుల్లో లేని వ్య‌వ‌హారం యుద్ధం ఆప‌డం అని ఉక్రెయిన్ ఇవాళ భావించి, కొన్ని దేశాలు ఇచ్చిన ఆయుధ స‌హ‌కారాన్ని అందుకుంటుంది. కానీ ఇదే స‌మ‌యంలో ర‌ష్యాకు చెందిన సైన్యంలో కొంద‌రికి ఉక్రెయిన్ పై దాడి చేయ‌డం అస్స‌లు ఇష్టం లేని వ్య‌వ‌హారంగానే ఉంది.

ఎందుకంటే వాళ్లు చెబుతున్న మాట‌లు అందిస్తున్న సందేశాలు అన్నీ వీటినే ధ్రువీక‌రిస్తున్నాయి.అక్క‌డి ప్ర‌జ‌లు ర‌ష్యా సైనికుల‌ను ఫాసిస్టులుగా అభివ‌ర్ణిస్తున్నార‌ని కూడా కొన్ని సంక్షిప్త సందేశాల్లో వెల్ల‌డి అయ్యాయ‌ని ఉక్రెయిన్ రాయ‌బారి ఆధారాల‌తో స‌హా ప్రపంచానికి తెలియ‌జేశారు. మ‌రోవైపు 4500 మంది ర‌ష్యా సైనికుల‌ను చంపామ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు బెలెన్ స్కీ నిన్న మొన్న‌టి వేళ వెల్ల‌డించారు.

యుద్ధం వ‌ద్దు అని చెప్ప‌డం ఎంతో సులువు. యుద్ధం కావాలి అని అర‌వ‌డం ఇంకా సులువు. వ‌ద్ద‌నుకున్నా కావాల‌ని అన‌కున్నా కూడా ఇవాళ రెండు దేశాల మ‌ధ్య స‌ఖ్య‌త లేదా స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం అన్న‌ది నిర్మాణానికి నోచుకోవ‌డం లేదు. దీంతో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు కానీ ర‌ష్యా అధ్యక్షులు కానీ ఎవ‌రి దారిలో వారు వెళ్తూ త‌మ‌దైన రాజ‌కీయం ఒక‌టి న‌డుపుతున్నారు.

యుద్ధం కోసం ర‌ష్యా అర్రులు చాచుకుని కూర్చొందా అన్న విధంగా ఆ దేశం న‌డ‌వ‌డిక ఉంటే, అదే సంద‌ర్భంలో శాంతికి క‌నీస ప్రాధాన్యం ఇవ్వ‌కుండా ప్ర‌పంచ దేశాలు అన్నీ ఎందుక‌ని చోద్యం చూస్తున్నాయి అన్న ప్ర‌శ్న ఒక‌టి సుస్పష్ట రీతిలో విన‌ప‌డుతోంది.యుద్ధాన్ని ఎవ‌రు ఆపుతారు..ఎవ‌రు నిలువ‌రించి త‌మ స‌త్తా చాటుతారు.ర‌క్తపు మ‌డుగుల్లో ఉన్న దేహాల లెక్కింపు మాత్ర‌మే ఓ యుద్ధానికి ప్రామాణిక‌త అయి ఉంటే అప్పుడు దేశాల మ‌ధ్య స‌ఖ్య‌త సృష్టి లేదా స్నేహ బంధాల పున‌రుద్ధ‌ర‌ణ అన్న‌ది ఏ విధంగా సాధ్యం అవుతుంద‌ని?

Read more RELATED
Recommended to you

Exit mobile version