సినీ నటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చెన్నైలోని తన ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో ఆమెకు గతంలో కిందిస్థాయి కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. థియేటర్ యాజమాన్యం రూ.9.80 లక్షల ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కింద జమచేయడంతో కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఓకా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. జయప్రదకు చెందిన సినిమా థియేటర్ లో ఆమె ఇద్దరూ సోదరులు భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఈ సినిమా థియేటర్ పది సంవత్సరాల కిందటే మూతపడిపోయింది. ఆ కాలంలో ఈ థియేటర్ లో పని చేసిన ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ ను కట్ చేసుకున్న యాజమాన్యం తమ కాంట్రిబ్యూషన్ ను మాత్రం చెల్లించలేదు. దీంతో థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు 2023 ఆగస్టులో జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష విధించింది. దీంతో జయప్రద మెట్రోపాలిటన్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పిల్ చేసి, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ చెల్లించడంతో ఈ మేరకు సుప్రీంకోర్టు జైలు శిక్షను రద్దు చేసింది.