దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత రెండు పర్యాయలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. వారణాసిలో మోదీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు బీజేపీ శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మోదీ ఆధిక్యంలో ఉండటంతో గెలుపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ నిలిచారు.
మరోవైపు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లీడ్‌లో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పూరీలో ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ లీడ్‌లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటకలోని మండ్యాలో మాజీ సీఎం కుమారస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర బారామతిలో సుప్రియా సూలే, మధ్యప్రదేశ్‌లోని విదిశాలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు. బంగాల్ డైమండ్ హర్బర్‌లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లీడ్‌లో కొనసాగుతున్నారు.