టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిన్న ఏపీవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌పై పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ.. చంద్రబాబు చిత్రపరిశ్రమకు శ్రేయోభిలాషి వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారని, ఆయన తప్ప చిత్ర పరిశ్రమలో ఎవరూ చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు మాట్లాడడంలేదని నట్టి కుమార్ ప్రశ్నించారు. ఎవరికి భయపడి మౌనంగా ఉంటున్నారని నట్టి కుమార్ నిలదీశారు నట్టి కుమార్.
“పిలిస్తే పలికే వ్యక్తిగా, మన ఇంట్లో వ్యక్తిగా, ప్రతి కార్యక్రమానికి వస్తూ, ఇండస్ట్రీకి అండగా ఉంటున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ఇవాళ ఇండస్ట్రీ దూరమైంది. ఎవరికి భయపడి మాట్లాడడంలేదు? ఎవరికి భయపడి ఆయనకు దూరమయ్యారు? ఎవరికి భయపడి అటువైపు వెళ్లడంలేదు? ఈ ప్రశ్నలు నేను సూటిగా అడుగుతున్నా… ఏ ఒక్కరినో కాదు… నేను జూనియర్ ఎన్టీఆర్ ను అడుగుతున్నా, ప్రభాస్ ను అడుగుతున్నా, చిరంజీవి గారిని అడుగుతున్నా… ప్రసన్నకుమార్ గారు, వైవీఎస్ చౌదరి, దామోదర ప్రసాద్ తదితరులంతా ఏమైపోయారు? అశ్వినీదత్ గారు ఏమయ్యారు? అరవింద్ గారు, సురేశ్ బాబు గారు, కుమార్ చౌదరి గారు ఏమయ్యారు? రాఘవేంద్రరావు గారు మాత్రం ట్వీట్ చేశారు.
చంద్రబాబు వల్ల చిత్ర పరిశ్రమలో అధికారికంగానో, అనధికారికంగానో చాలామంది లబ్దిపొందారు. పదవి వచ్చినప్పుడు వెళ్లి బొకేలు ఇవ్వడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. మేం ఉన్నాం మీవెంట అనే భరోసా ఇవ్వాలి. అంతేతప్ప కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండడం సరికాదు” అని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.