భారత్‌కు బ్యాడ్ న్యూస్. మరో రెండు రోజుల్లో కావన్వెల్త్ క్రీడలు మొదలవనున్న వేళ భారత బృందానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు రేపిన నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా మీడియాకు వెల్లడించారు.
‘కామన్వెల్త్ గేమ్స్ 2022లో నీరజ్ చోప్రా పాల్గొనడం లేదు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ తుది పోటీల సమయంలో గాయపడటంతో అతడు ఫిట్‌గా లేడు. దీని గురించి అతడు అసోసియేషన్‌కు సమాచారమందించాడు’. అని మెహతా తెలిపారు.
గత ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తుది పోరులో నాలుగో ప్రయత్నంలో బల్లెం విసిరే సమయంలో అతడి తొడ కండరాలు పట్టేశాయి.
ఈ పోటీ అనంతరం నీరజ్ మాట్లాడుతూ.. ‘‘నాలుగో ప్రయత్నం తర్వాత నా తొడలో అసౌకర్యంగా అనిపించింది. నొప్పి కారణంగా నేను మరింతగా ప్రయత్నించలేకపోయాను. ఈ నొప్పి ఎలా ఉంటుందో పరీక్షలు చేస్తే గానీ తెలియదు’’ అని అన్నాడు. ఈ పోటీల అనంతరం నీరజ్‌ను పరీక్షించిన వైద్యులు.. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ నేపథ్యంలోనే తాను కామన్వెల్త్‌లో ఆడలేనని అతడు చెప్పినట్లు సమాచారం.