అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణంలో నాసిరక పనులు చేపట్టారంటూ కాంట్రాక్టర్ పై ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో నిధులు లేకపోవడంతోనే హడావుడిగా ఆసుపత్రిని అరకొర వసతులతో ప్రారంభించారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిలో రోగులకు సరైన మౌలిక వసతులు లేవని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో 100 పడకల ఆసుపత్రిగా మహర్దశ తీసుకొస్తానని తెలిపారు మంత్రి రాం ప్రసాద్.