Tollywood: కొత్త సొగసులు.. సరికొత్త సోయగాలు!

-

సినీ ఇండస్ట్రీ లో నిరంతరం కొత్తదనం కోసం అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా వారిని ఆకట్టుకునేందుకు… కథ.. కథనం.. తారాగణం.. సాంకేతికత.. ఇలా అన్నిచోట్లా వైవిధ్యత ఉండేలా చూసుకుంటారు దర్శక నిర్మాతలు. ‘కొత్తగా ఉంటుంద’ని ఏ విషయంలో అనిపించినా సరే, ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతుంటాయి సినీ వర్గాలు. అయితే కథ, కథనాల విషయంతో పాటు .. కొత్త తారాగణాన్ని తెరపైకి తీసుకు రావడంలో మరింత జోరు చూపిస్తుంటుంది మన చిత్రసీమ. ముఖ్యంగా కథానాయికల్ని! అటు బాలీవుడ్‌ మొదలుకొని.. ఇటు మలయాళం వరకు ఎక్కడ కొత్తందం మెరిసినా సరే, వెంటనే వారిని ఎర్ర తివాచి వేసి ఆహ్వానం పలుకుతుంటారు మన దర్శకనిర్మాతలు. అందుకే ఏటా పదుల సంఖ్యలో కొత్త భామలు మన తెరపై మెరుస్తున్నారు.

అయితే కొంతకాలంగా పాన్‌ ఇండియా చిత్రాల జోరు పెరగడంతో… తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న బాలీవుడ్‌ భామల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసం అన్ని భాషల్లోనూ గుర్తింపున్న తారల్ని ఎంపిక చేసుకోవాలనే వ్యూహంతో హిందీ భామలను ఎంపిక చేసుకుంటున్నాయి ఆయా చిత్రబృందాలు.

బాలీవుడ్​ బ్యూటీ అలియా భట్ ఇప్పటికే.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ తో సందడి చేసింది. అనంతరం ఎన్టీఆర్​తో కలిసి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. కానీ ఆ తర్వాత పెళ్లి అవ్వడం వల్ల మూవీ నుంచి తప్పుకుంది.

ఇక దీపికా పదుకొనె ప్రభాస్​తో ‘ప్రాజెక్ట్​ కె’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు చిత్రాలతో అలరించిన కియారా అడ్వాణీ.. త్వరలోనే ఆర్​సీ 15తో మన ముందుకు రానుంది. అనన్యపాండే విజయ్​దేవరకొండ ‘లైగర్’​తో అలరించనుంది. ఇలా పలువురు బీటౌన్​ భామలు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ‘సీతారామం’తో మృణాల్‌ ఠాకూర్‌, ‘మేజర్‌’, ‘గని’తో సయీ మంజ్రేకర్‌ తెలుగు తెరకు కొత్తందాన్ని అద్దేశారు.

ఇక దక్షిణాదికి చెందిన కథానాయికలు తెలుగులో ఈసారి ఎక్కువగా పరిచయమయ్యారు. ‘భీమ్లానాయక్‌’, ‘బింబిసార’ సినిమాలతో సంయుక్త మేనన్‌ సందడి చేసింది. మరిన్ని సినిమాల విషయంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు ఇదివరకే సుపరిచితమైనా మలయాళ బ్యూటీ నజ్రియా, ఈసారే నేరుగా నానితో కలిసి ‘అంటే సుందరానికి’ తెలుగు చిత్రం చేసింది. ఇక ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో రజీషా విజయన్‌ తెలుగుకు పరిచయమైంది. ‘గాడ్సే’తో ఐశ్వర్య లక్ష్మి, ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’తో రితిక నాయక్‌ ప్రేక్షకులు, పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు.

మరింత మంది కొత్తభామలు.. కథానాయికలు ఎంత మంది వచ్చినా మరొకరికి చోటు ఉంటుంది తెలుగులో. అలానే ఈ ఏడాది కూడా కొత్త భామలు వచ్చేస్తున్నారు. అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏజెంట్‌’తో సాక్షి వైద్య ఎంట్రీ ఇవ్వనుంది. మోడల్‌గా ఇప్పటికే అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన సాక్షికి.. సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్‌ ఉంది. తరచూ హాట్‌ హాట్‌ అందాలతో నెట్టింట సందడి చేస్తుంటుంది. ఇప్పుడామె అఖిల్‌ సినిమాతోనే వెండితెరపైకి తొలి అడుగు వేస్తోంది.

ఇక నాగశౌర్య ‘కృష్ణ వృంద విహారి’తో షెర్లీ సేటియా తెలుగు తెరపైకొస్తోంది. ఈమె మొదటగా యూట్యూబ్‌ సెన్సేషన్‌ గా పేరు తెచ్చుకొంది. మంబయికి వచ్చేసిన తరువాత… హిందీ యాక్షన్‌ కామెడి ఫిల్మ్‌ ‘ఏ జెంటిల్మెన్‌’లో డిస్కో…డిస్కో, ‘మస్కా’ సినిమాలో ‘ఐవన హ్యాంగ్‌ విత్‌ యూ’….మొదలైన పాటలతో క్రేజ్​ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

‘లవ్‌ ఫెయిల్యూర్’’ అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ ఐశ్వర్య మేనన్‌. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ భామ రవితేజ కొత్త చిత్రంతో తెలుగులోకి నేరుగా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన ఓ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశముండగా.. ఓ నాయికగా ఐశ్వర్య మేనన్‌ పేరును ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్​ ‘స్పై’ చిత్రంలోనూ ఈమె హీరోయిన్​గా నటిస్తుందని సమాచారం.

కాగా, కొన్నేళ్లుగా తెలుగులో స్టార్‌ భామలుగా కొనసాగుతున్న చాలామంది ఇప్పుడు హిందీ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ప్రముఖ కథానాయికలు నయనతార, సమంత, రాశీఖన్నా ఇంకా పలువురు భామలు ఈ జాబితాలో ఉన్నారు. దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న యాక్షన్ థ్రిల్లర్​ చిత్రం ‘జవాన్​’లో బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్ ఖాన్​ సరసన నయన్​ నటించనుంది. సామ్​.. ‘ది ఫ్యామిలీ మ్యాన్​ 2’ హిందీ వెబ్​ సిరీస్​తో ఓటీటీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుణ్​ ధావన్​తో కలిసి మరో వెబ్​సిరీస్​లో నటిస్తోంది. ఇక రాశీ.. ​​ స్టార్​ హీరో అజయ్​ దేవగణ్​తో కలిసి ‘రుద్ర:ది ఎడ్జ్​ ఆఫ్​ డార్క్​నెస్’ అనే హిందీ వెబ్​ సిరీస్​​తో బాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇప్పుడు త్వరలోనే విడుదల కానున్న ‘యోధా’ చిత్రంలో ఈ భామ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version