మద్యం బాబుల ఆగడాలను కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదించిన మార్గదర్శకాలను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే వారి వివరాలను కోర్టుకు సమర్పించి లైసెన్స్ రద్దు ఉత్తర్వులను రవాణాశాఖకు పంపుతారు. ఫలితంగా మూడు నెలలపాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. ఒకసారి పట్టుబడిన వ్యక్తులు భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కోర్టులో ప్రతి కేసు నమోదవుతుందని, జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్నారు రంగనాథ్.
అంతేకాకుండా విదేశాలకు వెళ్లే వీలు కూడా ఉండదన్నారు. అంతేకాదు, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినప్పుడు తీవ్రత ఆధారంగా లైసెన్స్ శాశ్వతంగానూ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. మరోవైపు, వాహనాలు నడుపుతూ మైనర్లు పట్టుబడితే మోటారు వాహన చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులను కూడా జైలుకు పంపింస్తామని ఆయన పేర్కొన్నారు. వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలు చేయడంతోపాటు కిడ్నాప్‌లు, అత్యాచారాలకు కార్లను వినియోగిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడమే కాకుండా సీసీ కెమెరాలకు చిక్కినా వారిపై కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.