తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఈ కేసుని సిట్ నుంచి సీబీఐకి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనిపై కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. సీబీఐకి కేసు బదిలింపుని ఆపేయాలని పిటిషన్ వేసింది. ఇక దీనిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇదే సమయంలో తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలని కేసీఆర్ ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ లో చేరడం వల్ల 12 మంది ఎమ్మెల్యేలకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రయోజనం చేకూరిందని ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో కేసు మరో మలుపు తిరిగింది.
ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను నిందితుల తరుపు న్యాయవాది కోర్టుకు సమర్పింనున్నారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీ చేర్చుకుందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకుందని నిందితుల తరుపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.
ఓ వైపు 2018 తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని రేవంత్ ఫిర్యాదు చేశారు. అటు కోర్టులో 2014-18 వరకు 37 మంది ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ప్రస్తుతం కొనుగోలు కేసులో ఉన్న నిండుతుల తరుపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. మొత్తం ఈ కేసు అటు తిప్పి, ఇటు తిప్పి బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటుందా? అని విశ్లేషకులు డౌట్ పడుతున్నారు.