ఇప్పటికే కరోనా కొత్త కొత్త వేరియంట్‌లు ప్రజలపై విజృంభిస్తుంటే.. భారత్‌లో మరోసారి నోరో వైరస్ కలకలం సృష్టించింది. కేరళ ఎర్నాకులం జిల్లాలోని కక్కానాడ్లో ఇద్దరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకింది. దీంతో వైరస్ వ్యాపించకుండా మూడురోజుల పాటు పాఠశాలను మూసివేశారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ పాఠశాలలో చదువుతున్న 62 మంది విద్యార్థులకు వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపించాయి. నోరో వైరస్ అన్న అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్‌కు పంపించంగా అందులో ఇద్దరికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వ్యాధి సోకిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని వైద్య వర్గాల సమాచారం.
పాఠశాల విద్యార్థులందరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.అసలు ఈ నోరోవైరస్ ఏంటి..?:నోరో వైరస్‌ను స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణముంది. ఇది అన్ని వయస్సుల వారికి సోకుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాల కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది.