తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన, 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
శాసనసభలో వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న టిఆర్ఎస్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 30న ఉదయం 9 గంటల నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం.. సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి గత ఏడాది డిసెంబర్ లోనే రాజీనామా చేయడంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది.