భారత రాష్ట్రపతిగా ఇటీవలే పదవీ ప్రమాణం చేసిన ద్రౌపది ముర్మును సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖులు కలిశారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికౌనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ సతీ సమేతంగా సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తన సతీమణితో కలిసి ఆయన అభినందించారు. ఈ ఫొటోలను రాష్ట్రపతి భవన్ వర్గాలను సోషల్ మీడియాలో విడుదల చేశాయి. ఇదిలా ఉంటే… పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు కూడా సోమవారం ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ మొత్తానికి దిగి వచ్చారు. రాష్ట్రపత్నీ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. పొరపాటున నోరు జారానని, తన క్షమాపణల్ని అంగీకరించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ” మీ పదవిని ఉద్దేశిస్తూ తప్పుగా పదాన్ని ఉపయోగించినందుకు నా విచారం వ్యక్తం చేయడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. నోరు జారడం వల్లే ఇలా జరిగింది. నేను క్షమాపణలు కోరుతున్నాను. దానిని అంగీకరించమని అభ్యర్థిస్తున్నాను” అని లేఖలో రాశారు.