రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం కల్పించిందని ఆరోపించారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో వివక్ష, కక్షపూరితంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లంచం ఇచ్చిన వాళ్ళకే దళిత బంధు, రెండు పడక గదులను ఇస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీకి చెందిన వ్యక్తులకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారని అన్నారు ప్రభాకర్. తెరాస సొమ్ములాగా కేసీఅర్ వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పర్యవేక్షణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. డిల్లీ నూతన ఎక్సైజ్ విధానం.. తెలంగాణ విధానం ఒకటేనన్నారు. డిల్లీ, తెలంగాణలో మద్యం సరఫరా చేసేది ఒక్కరేనని ఆరోపించారు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో మద్యం విధానాన్ని రెండు సార్లు సవరించడంతో పాటు విపరీతంగా ధరలు పెంచారని అన్నారు.
మద్యం, అక్రమాలకు తెలంగాణ ఢిల్లీకి ఆదర్శం అయ్యిందన్నారు ప్రభాకర్. అర్ధాంతరంగా ఎక్సైజ్ శాఖ మంత్రినీ తొలగించారని.. ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇంటి నుంచి బోనం తీసుకెళ్లే కవిత ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకెళ్లడం లేదన్నారు. కవిత కనుసన్నల్లో ఉన్న వ్యక్తికే ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ ఎక్సైజ్ విధానం, అమ్మకాలపైన సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.